Solapur Accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా సోలాపూర్ జిల్లా తాండుల్వాడి సమీపంలో పికప్ ట్రక్కు బావిలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురిని బావిలో నుంచి సురక్షితంగా బయటకు తీసినట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోలాపూర్ జిల్లాలోని రంజణిగావ్ గ్రామానికి చెందిన 14 మంది భక్తులు పికప్ వాహనంలో మస్వాడ్ ప్రాంతంలోని సిద్ధనాథ్ దేవాలయం దర్శించుకునేందుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో పండర్పూర్ వెళ్తుండగా.. తాండుల్వాడీ సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పిన పికప్ వాహనం రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. బావి పూర్తిగా నీటితో నిండి ఉండటంతో పికప్ ట్రక్కు క్షణాల్లోనే మునిగిపోయింది.
ఇది గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాల ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. బావిలో నుంచి ఎనిమిది మంది మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. ఇక రో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

Solapur Train Accident
ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పికప్ ట్రక్కులో సాంకేతిక లోపం తలెత్తిందా? లేదా డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ప్రమాదం జరిగిన బావికి రక్షణ గోడలు లేవని.. దీనివల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.