న్యూఢిల్లీ, జూన్ 8: కృత్రిమ మేధ కారణంగా సాఫ్ట్వేర్ రంగం రూపురేఖలు పూర్తిగా రూపాంతరం చెందుతున్న క్రమంలో టెక్ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే యువ ప్రొఫెషనల్స్‌కు అవసరమైన ఒక నైపుణ్యాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వెల్లడించారు. అదే బలమైన ఫండమెంటల్స్. వీటి శక్తిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయవద్దని యూట్యూబర్ సజ్జాద్ ఖాడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) శక్తిసామర్థ్యాలు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నప్పటికీ పునాది గణన ఆలోచన, సిస్టమ్ డిజైన్ నైపుణ్యాలు ఇప్పటికీ చాలా కీలకమని తాను నమ్ముతున్నానన్నారు. ‘మీరు కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే సాఫ్ట్వేర్ నిజమైన బేసిక్స్‌పై పట్టు సాధించండి, ఇది చాలా ముఖ్యమైన విషయంగా నేను భావిస్తున్నా. గణన పరంగా ఆలోచించే సామర్ధ్యం కూడా అవసరం’ అని అన్నారు.
ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ల్యాండ్‌స్కేప్‌లో అడుగుపెడుతున్న వారికి మీ సలహా ఏమిటన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఏఐ కోడింగ్‌లో సహాయ పడగలిగినప్పటికీ, అది ఇప్పటికీ తార్కికంగా ఆలోచించే, నిర్మాణాత్మక మార్గదర్శకత్వాన్ని అందించే యూజర్ సామర్థ్యంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఆ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్‌గా మారడానికి మార్గం వేగవంతం అవుతుందని, దీంతో మనమందరం మరింత సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్‌లుగా మారబోతున్నామని ఆయన తెలిపారు.