బెంగుళూరు: లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణ(Bhavani Revanna)కు ఇవాళ కర్నాటక సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఓ కేసులో విచారించేందుకు ఆమెకు ఆ నోటీసులు ఇచ్చారు. ఐపీసీ 64ఏ, 365, 109, 120బీ సెక్షన్ల కింద నమోదు అయిన కేసులో భవానీ రేవణ్ణను విచారించనున్నారు. జూన్ ఒకటో తేదీన హోలెనర్సాపూర్లో ఉన్న ఇంట్లో విచారణకు సిద్ధంగా ఉండాలని ఆ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున బెంగుళూరులోని కెంపగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ప్రజ్వల్‌ను అరెస్టు చేశారు. సిట్ అరెస్టు చేయగానే ప్రజ్వల్ విచారణ ప్రారంభమైంది. జర్మనీలోని మునిచ్ నుంచి రాగానే ఎయిర్‌పోర్టులోనే ప్రజ్వల్‌ను ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రజ్వల్‌పై పొటెన్సీ టెస్టు నిర్వహించేందుకు సిట్ ప్లాన్ చేస్తోంది. ప్రజ్వల్ రేవణ్ణ, భవానీ రేవణ్ణకు చెందిన అభ్యర్థనలను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఇవాళ విచారించనున్నది.