న్యూఢిల్లీ: కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయం బయట భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారులు చేసిన దాడిని నిరసిస్తూ హిందూ, సిక్కు సంఘాల కార్యకర్తలు ఆదివారం కెనడా హైకమిషన్ కార్యాలయం బయట భారీ నిరసన నిర్వహించారు. పలు హిందూ సంఘాలు బ్రాంప్టన్ ఘటనపై నిరసనకు పిలుపునివ్వడంతో ఢిల్లీ పోలీసులు శాంతి భద్రతల కోసం కెనడా హైకమిషన్ ఆఫీస్ ముందు భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. పలువురు హిందూ సిక్ గ్లోబల్ ఫోరం కార్యకర్తలు వాటిని దాటుకొని హైకమిషన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ‘హిందువులు, సిక్కులు ఐక్యంగా ఉన్నారు’, ‘కెనడాలోని ఆలయాలను అవమానించడాన్ని భారతీయులు సహించరు’ అన్న నినాదాలున్న ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నెల 4న బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్ బయట భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేశారు.