న్యూఢిల్లీ : ఢిల్లీలో కాలుష్యం నేపథ్యంలో వాయు నాణ్యత పడిపోతున్నది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు పాఠశాలలను మూసివేయాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. పిల్లల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దేశ రాజధానిలో వాయు నాణ్యత మెరుగయ్యే వరకు పాఠశాలలను మూసివేసే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఎన్సీపీసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) డేటా ప్రకారం.. బుధవారం ఢిల్లీలో ‘వెరీ పూర్’ కేటగిరిలో నమోదైంది.
గురువారం సైతం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. గాలి నాణ్యత పడిపోతున్న నేపథ్యంలో శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నగరంలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి గోపాల్‌రాయ్ ఉద్యోగులు ఇండ్ల నుంచి పని చేయాలని సూచించారు. ప్రైవేటు వాహనాలను వినియోగించొద్దని కోరారు. ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో బుధవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 345గా రికార్డయ్యింది.