Senior Haryana cop | హర్యానా (Haryana) అదనపు డీజీపీ వై పూరన్ కుమార్ (Puran Kumar) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్, హర్యానా సీనియర్ పోలీసు అధికారి, రోహ్తక్ (Rohatk) ఎస్పీ నరేంద్ర బిజార్నియాలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తన భర్త ఆత్మహత్యకు వీరిద్దరూ ప్రేరేపించారని ఆరోపిస్తూ పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారి అన్మీత్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు అధికారులు వారిపై కేసులు బుక్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్పీపై అధికారులు వేటు వేశారు. ఆయన్ని పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో రోహ్తక్ ఎస్పీగా సురీందర్ సింగ్ భోరియాని నియమించారు.
ఈనెల 7న (మంగళవారం) చండీగఢ్‌లోని సెక్టార్ 11లోగల తన నివాసంలో కుర్చీలో కూర్చుని సర్వీస్ రివాల్వర్‌తో పేల్చుకుని పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. వీలునామాతోపాటు ఓ సూసైడ్ నోట్‌ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్లో ఉద్యోగానికి సంబంధించి తాను ఎదుర్కొంటున్న సమస్యలు, అసంతృప్తిని ఆయన ప్రస్తావించారు. తన భర్త ఆత్మహత్యకు డీజీపీ, ఎస్పీ ప్రేరేపించారని ఆరోపిస్తూ పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారి అన్మీత్ కుమార్ గురువారం ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని సెక్షన్ 108 కింద ఆమె తన ఫిర్యాదును అందచేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్ట నిబంధనలు కూడా ఈ సెక్షన్లోకి వస్తాయి. తన ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధ్యులైన ఇద్దరు సీనియర్ అధికారులను అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read..