న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే న్యాయవాద వృత్తిని విడిచిపెట్టాలని నిర్ణయించారు. 48 ఏండ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్న ఆయన తన నిర్ణయాన్ని వాట్సాప్ ద్వారా ప్రకటించారు. ‘న్యాయవాద వృత్తిలో ఉంటూ బార్లో 48 ఏండ్ల పాటు గడిపిన తర్వాత 70వ పుట్టిన రోజు జరుపుకునే ఈ ఆనంద క్షణాన ఆ వృత్తిని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నా’ అని ఆయన తెలిపారు. 1954, అక్టోబర్ 27న జన్మించిన దవే 1978లో గుజరాత్లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.
సుప్రీం కోర్టులో టాప్ లాయర్‌గా గుర్తింపు పొందారు. 1998లో ఆయనను సుప్రీం కోర్టు సీనియర్ లాయర్‌గా గుర్తించింది. దవే తండ్రి జస్టిస్ అరవింద్ దవే గుజరాత్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. తన వృత్తి విరమణ నిర్ణయం వెనుక ప్రత్యేక కారణం ఏమీ లేదని, అయితే యువతకు ఈ రంగంలో మార్గం, అవకాశం చూపేందుకు దీనిని విడిచిపెడుతున్నానని చెప్పారు. సమాజ సేవకు, తన అభిరుచులు నెరవేర్చుకోవడానికి శేష జీవితాన్ని అంకితం చేస్తానని తెలిపారు.