న్యూఢిల్లీ, ఆగస్టు 22: మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్టులు, సోదాలు, ఆస్తుల జప్తు, స్వాధీనాలకు సంబంధించి పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు అధికారాలను కల్పించడాన్ని సమర్థిస్తూ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు సమీక్ష జరుపనున్నది. ఇందుకు సంబంధించిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. సుప్రీంకోర్టులో సోమవారం ఈ పిటిషన్ ప్రస్తావనకు రావడంతో దాన్ని లిస్ట్ చేస్తామని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.
మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల చెల్లుబాటును సుప్రీంకోర్టు గత నెల 27న సమర్థిస్తూ.. మనీ లాండరింగ్‌కు పాల్పడటం సాధారణ నేరం కాదని, ఇలాంటి నేరాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల పనితీరుకు ముప్పు వాటిల్లుతుందని అభిప్రాయపడింది. అయితే ఈ తీర్పుపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. చట్టంలోని లొసుగులను పరిశీలించకుండానే కోర్టు ఈ తీర్పు ఇచ్చిందని పేర్కొన్నాయి. కేంద్రం ఏకపక్ష సవరణలను కోర్టు సమర్థించడంతో రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు మోదీ సర్కారుకు మరింత బలం చేకూరినట్టయిందని ఆందోళన వ్యక్తంచేశాయి. తీర్పును సమీక్షించాలని కోరాయి.