బీజేపీ-శివసేన మైత్రిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే బతికుంటే… ఇరు పార్టీల మధ్య మైత్రి కొనసాగి ఉండేదన్నారు. శివసేన విలువ ఏమిటో ఆయనకు బాగా తెలుసన్నారు. మహారాష్ట్ర బీజేపీలో ముండే మాటకు అడ్డు చెప్పేవారెవరూ లేరని, ఆయనకంటే పెద్ద నేత కూడా ఎవరూ లేరని రౌత్ అన్నారు. శివసేనను అర్థం చేసుకోవడంలో, వక్తృత్వంలో, మహారాష్ట్ర రాజకీయాలను కూలంకషంగా అర్థం చేసుకునే విషయంలో ఆయన తరహా మరొకరు లేరన్నారు. గోపీనాథ్ ముండే జయంతిని పురస్కరించుకొని రౌత్ పై వ్యాఖ్యలు చేశారు. ఆయన బతికున్నంత కాలం బీజేపీ, శివసేన మధ్య సఖ్యత కోసం కృషి చేశారని, ఆయన బతికుంటే మాత్రం ఇరు పార్టీల మధ్య స్నేహం అలాగే కొనసాగేదని రౌత్ పేర్కొన్నారు.