Salman Khan : తన తండ్రి బాబా సిద్ధిఖీ (Baba Siddique) దారుణ హత్యతో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ (Salman khan) తీవ్ర కుంగుబాటుకు గురయ్యారని సిద్ధిఖీ కుమారుడు జిషాన్ సిద్ధిఖీ (Zishaan Siddique) తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో సల్మాన్ తమ కుటుంబానికి ఎంతో అండగా నిలిచారన్నారు. ప్రతిరోజూ ఫోన్ చేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారని, తమకెంతో ధైర్మాన్ని ఇస్తున్నారని చెప్పారు.
‘నా తండ్రితో సల్మాన్‌ఖాన్‌కు మంచి అనుబంధం ఉంది. ఆయన మరణంతో సల్మాన్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మా కుటుంబానికి సపోర్ట్‌గా నిలిచారు. మాకెంతో ధైర్యాన్ని ఇచ్చారు. నాన్న మరణం తర్వాత బాధతో ఆయనకు నిద్రపట్టడం లేదు. ప్రతిరోజూ రాత్రి నాకు ఫోన్ చేస్తుంటారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటారు. నా తండ్రితో తనకున్న అనుబంధం గురించి చెబుతుంటారు’ అని జిషాన్ తెలిపారు. సినీ కుటుంబానికి చెందిన వారందరితో తన తండ్రికి స్నేహం ఉందని చెప్పారు. వాళ్లందరూ తనకు కుటుంబంతో సమానం అన్నారు.
ముంబైలోని బాంద్రా కార్యాలయం వద్ద ఉండగా ముగ్గురు దుండగులు బాబా సిద్ధిఖీపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను లీలావతి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఈ హత్యకు నిందితులు వరుసగా 10 సార్లు ప్రయత్నించారని విచారణలో వెల్లడైంది. సిద్ధిఖీ హత్య గురించి తెలిసిన వెంటనే సల్మాన్ షూటింగ్స్ రద్దు చేసుకుని వచ్చారు. మరోవైపు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు ఎదురవుతున్నాయి.