Ramesh Naik | న్యూఢిల్లీ, జూన్ 15: నిజామాబాద్ జిల్లా యువ రచయిత, గిరిజన బిడ్డ రమేశ్ కార్తీక్ నాయక్(26)కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. ఈ ఏడాది వివిధ భాషల్లో అత్యుత్తమ రచనలు చేసిన రచయితలకు శుక్రవారం యువ, బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. ఇంగ్లీష్ రచయిత కే వైశాలీ, హిందీ రచయిత గౌరవ్ పాండే సహా 23 మంది రచయితలను యువ సాహిత్య పురస్కార అవార్డులకు ఎంపిక చేసింది. అలాగే 24 మందిని బాల సాహిత్య పురస్కారాలకు ఎంపిక చేశారు.
జావేద్ అంబర్ మిషాబీకి ఉర్దూలో యువ సాహిత్య పురస్కారం లభించగా; బాల సాహిత్య పురస్కారం అందుకున్న వారిలో పీ చంద్రశేఖర్ ఆజాద్(తెలుగు), షాంశూల్ ఇస్లామ్ ఫరూఖి(ఉర్దూ) ఉన్నారు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే సాహిత్యంపై మక్కువ పెంచుకున్న రమేశ్ కార్తీక్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ తెలుగు, ఇంగ్లీష్ చేశారు. ప్రస్తుతం దూరదర్శన్లో సాహిత్య కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. యువ, బాల సాహిత్య పురస్కారాల కింద విజేతలకు రూ.50 వేల నగదు, రాగి ఫలకాన్ని అందజేస్తారు.