రాయ్‌పూర్ : రూ.100 లంచం తీసుకున్నట్లు నమోదైన కేసులో నిందితునికి 39 ఏళ్ల పోరాటం తర్వాత న్యాయం దక్కింది. మధ్య ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థలో బిల్లింగ్ అసిస్టెంట్‌గా పని చేసిన జగదీశ్వర్ ప్రసాద్ అవస్థి నిర్దోషి అని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆయనకు దిగువ కోర్టు ఒక ఏడాది జైలు శిక్ష విధిస్తూ 2004లో ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఈ సంస్థ ఉద్యోగి అశోక్ కుమార్ వర్మకు చెల్లించవలసిన బాకీలను పరిష్కరించడం కోసం అవస్థి రూ.100 లంచం డిమాండ్ చేసినట్లు 1986లో కేసు నమోదైంది. అశోక్ ఫిర్యాదు మేరకు లోకాయుక్త స్పందించి, వల పన్నింది. అవస్థి కరెన్సీ నోట్లతో పట్టుబడ్డారు. అయితే ప్రాసిక్యూషన్ కేసులో లోపాలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. స్వతంత్ర సాక్షి లేరని, షాడో విట్నెస్ ఉన్నప్పటికీ, అవస్థి లంచం అడిగినట్లు, తీసుకున్నట్లు తాను చూడలేదని చెప్పారని తెలిపింది.
ప్రభుత్వ సాక్షులు 20-25 గజాల దూరంలో ఉన్నారని, వారు ఈ లావాదేవీని పరిశీలించడం సాధ్యం కాదని పేర్కొంది. పట్టుబడిన సొమ్ము ఒక రూ.100 నోటు? లేదా రెండు రూ.50 నోట్లు? అనే విషయంపై స్పష్టత లేదని తెలిపింది. అవస్థి వినిపించిన వాదనల్లో, ఈ ఆరోపిత సంఘటన జరిగిన సమయంలో తనకు బిల్లులను ఆమోదించే అధికారం లేదని, ఓ నెల రోజుల తర్వాత మాత్రమే తనకు ఆ అధికారం వచ్చిందని తెలిపారు. ఉద్దేశం, డిమాండ్ రుజువు కాకుండా, కేవలం కళంకిత నోట్లను స్వాధీనం చేసుకోవడం వల్ల నేరం రుజువు కాబోదని హైకోర్టు స్పష్టం చేసింది. లోకాయుక్త పన్నిన వల విఫలమైందని చెప్పింది. అవస్థి దోషి అని చెప్పిన తీర్పు సమర్థనీయం కాదని వివరించింది.