గౌహతి: రాయల్ బెంగాల్ పులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అస్సాం రాజధాని గౌహతి జూలో ఈ ఘటన జరిగింది. ఆ రాష్ట్ర జూ, బొటానికల్ గార్డెన్లో కాజీ అనే రాయల్ బెంగాల్ ఆడ పులి ఉన్నది. శనివారం రెండు పిల్లలకు ఇది జన్మనిచ్చింది. ఆ జూ అధికారి సోమవారం ఈ విషయం తెలిపారు. దీంతో జూలో రాయల్ బెంగాల్ పులుల సంఖ్య 9కి పెరిగిందని చెప్పారు. చూడ ముచ్చటగా ఉన్న రెండు బెంగాల్ పులి పిల్లలను జాగ్రత్తగా సంరక్షిస్తున్నట్లు జూ అధికారి తెలిపారు. పులి పిల్లల ఫొటోలను ట్వీట్ చేశారు. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్యూట్ పులి పిల్లలు నెటిజన్లకు తెగ నచ్చాయి.