RG Kar Case | కోల్‌కతాలోని ఆర్జీ ఖర్ ఆసుపత్రిలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో నిరసనలు ఇంకా చల్లారడం లేదు. వైద్యులతో పాటు సామాన్యులు సైతం నిరసనల్లో పాల్గొంటూ వస్తున్నారు. మరో వైపు ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు పోలీసులపై త్రీమైన ఆరోపణలు చేశారు. మృతదేహాన్ని తమకు అప్పగించే సమయంలో కేసును తొక్కిపెట్టేందుకు సీనియర్ పోలీస్ అధికారి తమకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించగా తిరస్కరించినట్లు బాధిత కుటుంబం పేర్కొంది. తమ కుమార్తెకు న్యాయం చేయాలని బుధవారం తొలిసారి నిరసనలో పాల్గొన్న సందర్భంగా మృతురాలి కుటుంబీకులు ఈ ఆరోపణలు చేశారు. మృతురాలి తండ్రి మాట్లాడుతూ నిరసనల్లో నిరసనల్లో పాల్గొనాలని పలువురు కోరారని.. తాము ఇంకా ఏం చేస్తామన్నారు. ఘటనను సహించేది లేదని.. మాకు చాలా ప్రశ్నలు ఉన్నాయనీ.. వాటన్నింటిని పోలీసులను అడుగుతామన్నారు.
పోలీసులు కేసుపై సమగ్ర దర్యాప్తు చేయకుండా కేసును మూసివేసేందుకు ప్రయత్నించారన్నారు. కేసును తొలి నుంచి తొక్కి పెట్టేందుకు పోలీసులు ప్రయత్నించారని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన రోజున రాత్రి కుమార్తె మృతదేహాన్ని దహన సంస్కరాల కోసం తీసుకెళ్లాలని ఒత్తిడి చేశారని.. ఎలాంటి విచారణ లేకుండానే ఆత్మహత్య చేసుకుందని చెప్పారని ఆయన ఆరోపించారు. హాస్పిటల్‌కు తాము 12.10 గంటలకు చేరుకుంటే.. కూతురి ముఖం చూపించేందుకు తమను సెమినార్ హాల్ బయటే మూడుగంటల పాటు కూర్చుండబెట్టారని.. మృతదేహాన్ని చూసేందుకు అనుమతించలేదని.. పోస్టుమార్టం కోసం తీసుకెళ్లే వరకు పోలీస్‌స్టేషన్‌లో నిరీక్షించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు హాస్పిటల్ అధికారులెవరూ తనతో మాట్లాడేందుకు ప్రయత్నించలేదన్నారు. అంత్యక్రియలు చేయకూడదని అనుకున్నామని.. మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చినా పోలీస్‌స్టేషన్‌లోనే ఉండిపోయామన్నారు.
ఆ తర్వాత నిస్సహాయ స్థితిలో ఒత్తిడికి లోనయ్యామని.. ఇంటికి వచ్చే సరికి 400 మంది పోలీసులు ఉన్నారని.. మరో మార్గం లేక మృతదేహానికి దహన సంస్కారాలు చేయాల్సి వచ్చిందన్నారు. ఆ రోజున దహన సంస్కారాలకు ఖర్చు ఎవరు భరించారనే విషయం ఇప్పటికీ తనకు తెలియదన్నారు. మృతదేహాన్ని తమకు అప్పగించిప్పుడు సీనియర్ పోలీస్ అధికారి తమకు డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఆగస్టు 8-9 మధ్య రాత్రి ఆర్జీ ఖర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై లైంగిక దాడి జరిగింది. ఆ తర్వాత ఆమెను కిరాతకంగా హత్య చేశారు. హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా.. వైద్యులతో పాటు జనం నిరసనలు చేపట్టారు. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఘటనపై సీబీఐ విచారణ జరుపుతున్నది. నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో మమతా బెనర్జీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది.