Revanth Reddy | న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోయింది. గత రెండు రోజుల నుంచి కొనసాగుతోన్న ఉత్కంఠకు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ జాతీయ మీడియాకు స్పష్టం చేశారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేశామని, ఆ నిర్ణయం జరిగిపోయిందని రాహుల్ తెలిపారు. ఇక డిప్యూటీ సీఎంలుగా ఎవరు కొనసాగుతారనే విషయంలో మాత్రం స్పష్టత రాలేదు.
తెలంగాణ సీఎంను ఎంపిక చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో మంగళవారం మధ్యాహ్నం అర గంట పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మాణిక్ రావు థాక్రే, డీకే శివకుమార్ హాజరయ్యారు. సీఎం ఎంపికపై సుదీర్ఘంగా చర్చించి, ఓ నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమంత్రి పోస్టును రేవంత్‌కే కట్టబెట్టాలని రాహుల్ సూచించారు. ఈ ప్రతిపాదనకు సభ్యులందరూ అంగీకరించినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో మాణిక్ రావు థాక్రే, డీకే శివకుమార్ హైదరాబాద్‌కు బయల్దేరారు. ఇవాళ రాత్రికి సీఎల్పీ సమావేశం నిర్వహించి, రేవంత్ పేరును అధికారికంగా డీకే శివకుమార్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఖర్గే నివాసంలో సమావేశానికి ముందు సీఎం పోస్టు కోసం పోటీ పడ్డ మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాణిక్ రావు థాక్రే, డీకే శివకుమార్ వేర్వేరుగా చర్చలు జరిపి బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఇక భట్టికి డిప్యూటీ సీఎం కట్టబెట్టే అవకాశం ఉంది.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన సీఎల్పీ సమావేశంలోనూ 64 మంది ఎమ్మెల్యేలకు గానూ 42 మంది ఎమ్మెల్యేలు రేవంత్‌కే మద్దతు తెలిపారు. ఈ విషయాన్ని కూడా హైకమాండ్ పరిగణనలోకి తీసుకుని, రేవంత్‌నే సీఎం చేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.