చెన్నై: రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు రక్తం మరకలు అంటిన క్యాప్, నేమ్ బ్యాడ్జీతో ఒక పోలీస్ అధికారి సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేశారు. ఇవి తనకు ‘అపారమైన సెంటిమెంట్’ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (శిక్షణ) హోదాలో రిటైర్ అయిన ఆయన చెప్పారు. తమిళనాడుకు చెందిన ఐపీఎస్ అధికారి ప్రదీప్ వీ ఫిలిప్ 1991లో కాంచీపురం ఏఎస్పీగా ఉన్నారు. ఆ ఏడాది మే 21న శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన రాజీవ్ గాంధీని మానవ బాంబు రూపంలో ఎల్టీటీఈ హత్య చేసింది. ఈ ఘటనలో రాజీవ్ గాంధీతోపాటు పలువురు మరణించారు.
నాడు అక్కడ భద్రతా విధుల్లో ఉన్న పోలీస్ అధికారి ఫిలిప్ గాయాలతో బయటపడ్డారు. ఆయన ధరించిన పోలీస్ టోపీ, నేమ్ బ్యాడ్జీలకు రక్తం మరకలు అంటుకున్నాయి. రాజీవ్ గాంధీ హత్యపై దర్యాప్తు చేసిన సిట్ వాటిని ఆధారంగా స్వాధీనం చేసుకుని కోర్టుకు సమర్పించింది. దీంతో నాటి నుంచి ఆ పోలీస్ టోపీ, నేమ్ బ్యాడ్జీ కోర్టు కస్టడీలో ఉన్నాయి.
కాగా, తన పదవీ విరమణకు కొన్ని రోజుల ముందు ఫిలిప్ కోర్టును ఆశ్రయించారు. తనకు అపారమైన సెంటిమెంట్‌తో కూడిన వాటిని చివరి రోజు డ్యూటీలో ధరించే అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో మొదటి అదనపు సెషన్స్ న్యాయమూర్తి టి చంద్రశేఖరన్ సెప్టెంబర్ 28న వాటి తాత్కాలిక కస్టడీకి అనుమతి ఇచ్చారు. ఒక లక్ష సొంత బాండ్‌పై వాటిని ఇచ్చేందుకు అంగీకరించారు. అక్టోబర్ 28న లేదా అంతకు ముందు వాటిని తిరిగి కోర్టుకు అందజేయాలని ఆదేశించారు. ‘ఆ టోపీ, బ్యాడ్జ్ అక్షరాలా ఆయన రక్తం, చెమట, 34 ఏండ్ల ప్రొఫెషనల్ కెరీర్ కన్నీళ్లను సూచిస్తాయి’ అని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
కాగా, సెంటిమెంట్‌తో కూడిన తన టోపీ, నేమ్ బ్యాడ్జీ ధరించిన ప్రదీప్ వీ ఫిలిప్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేశారు. ‘34 ఏండ్ల సేవా జీవితం ముగింపు రోజు నా సామర్ధ్యంలో భాగమైన టోపీ, నేమ్ బ్యాడ్జ్ ధరించడం, నేను అనుభవించిన గాయం, ఉల్లాసం, చట్టం, విచారం – వంటి భావోద్వేగాల మిశ్రమం. వీటిని ఒక్కసారిగా అనుభవించిన ఈ గ్రహం మీద ఉన్న ఏకైక వ్యక్తిని నేను’ అని రిటైర్ సందర్భంగా ఆయన అన్నారు. నాటి విషాదం తన జీవితాన్ని, దృక్పథాన్ని మార్చిందని చెప్పారు. తన శేష జీవితాన్ని ప్రజల సేవ కోసం అంకితం చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అలాగే రాజీవ్ హత్య సందర్భంగా తాను ఎదుర్కొన్న అనుభవంపై పుస్తకం రాస్తానని ఫిలిప్ వెల్లడించారు.