న్యూఢిల్లీ: గర్భ ధారణ, లింగ నిర్ధారణ పరీక్షల చట్టాన్ని(పీసీపీఎన్డీటీ యాక్ట్) సమర్థంగా అమలు చేయడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారో తెలియజేయాలని రాష్ర్టాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఈ చట్టం సరిగ్గా అమలు కావడం లేదని, ఇందుకు సంబంధించిన కేసుల్లో తక్కువ మందికి శిక్ష పడుతున్నదని పిటిషనర్ అడ్వకేట్ శోభా గుప్తా కోర్టుకు తెలిపారు. గతంలో కోర్టు కేవలం కేంద్రానికి నోటీసులు జారీ చేసిందని.. చట్టం అమలు రాష్ర్టాల బాధ్యతని గుర్తు చేశారు. దీంతో చట్టాన్ని అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలను ఆరు వారాల్లోగా తమకు నివేదించాలని అన్ని రాష్ర్టాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.