న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల శకటాలు, అదేవిధంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలను ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తున్నది. అదేవిధంగా ఈ ఏడాది కూడా రిపబ్లిక్ డే వేడుకల్లో శకటాల ప్రదర్శన జరిగింది. ఈ ఏడాది 73వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మొత్తం తొమ్మిది కేంద్ర మంత్రిత్వ శాఖల శకటాలను ప్రదర్శించారు. వాటిలో పౌర విమానయాన శాఖ, విద్యాశాఖల శకటాలు సంయుక్తంగా విజేతలుగా నిలిచాయి.
కాగా, పౌరవిమానయాన శాఖ శకటాన్ని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించడం ఇదే తొలిసారి. పరేడ్‌లో ప్రదర్శించిన కేంద్ర విద్యాశాఖ శకటం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ప్రతిబింబించేలా, పౌరవిమానయాన శాఖ శకటం ఉడాన్ థీమ్‌ను తెలియజెప్పేలా ఉన్నాయి. ఇక ఇండియన్ నేవీ మార్చింగ్ కంటింజెంట్ బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్‌గా బహుమతి దక్కించుకున్నది. కేంద్ర బలగాల విభాగంలో సీఐఎస్ఎఫ్ బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్‌గా నిలిచింది.
ఇక, రాష్ట్రాల విషయానికొస్తే.. మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాల్లో ఉత్తరప్రదేశ్ శకటం ఉత్తమ శకటంగా బహుమతి పొందింది. ఈ శకటం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ థీమ్‌ను, కాశీవిశ్వనాథ్ ధామ్‌ను ప్రదర్శించింది. కర్ణాటక రాష్ట్ర శకటానికి రెండో బహుమతి దక్కింది. ఈ శకటంలో సాంప్రదాయ చేనేత వృత్తులను ప్రదర్శించారు. మూడో స్థానంలో మేఘాలయా శకటం నిలిచింది. మేఘాలయ 50 ఏండ్ల రాష్ట్ర హోదా, ఆ రాష్ట్రంలో ఎస్‌హెచ్‌జీలకు ఇస్తున్న ప్రాధాన్యం గురించి ఆ శకటం ద్వారా తెలియజెప్పారు.