బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 12:26:56

రేపోరేటు త‌గ్గితే సామాన్య‌ ప్ర‌జ‌ల‌కు క‌లిగే లాభం ఇదే...

రేపోరేటు త‌గ్గితే సామాన్య‌ ప్ర‌జ‌ల‌కు క‌లిగే లాభం ఇదే...

 క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్‌తో దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ పూర్తిగా కుదేలైన సంగ‌తి తెలిసిందే. దీనిని అదుపు చేయ‌డానికి ప్ర‌జ‌ల‌కు ఉప‌స‌మ‌నం క‌లిగించేందుకు  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్‌ను తగ్గించింది.  రివ‌ర్స్ రెపో రేటు 90 బేసిస్ పాయింట్లు త‌గ్గించి 4 శాతానికి, రెపో రేటు 75 బేసిస్ పాయింట్లు త‌గ్గించ‌డంతో రెపోరేటు 4.4 శాతానికి త‌గ్గింద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు. రెపో రేట్ తగ్గిస్తే సామాన్యులకు లాభం అనేది ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం...  ఈ విషయం గురించి  తెలుసుకోవాలంటే ముందు అసలు రేపో రేట్, రివర్స్ రేపో రేట్ అంటే ఏంటీ? రెండింటి మధ్య తేడాలు ఏంటీ? తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే దీని గురించి మ‌న‌కు అర్థం అవుతుంది.

రెపో రేట్ అంటే ఏంటీ?

ప్రజలకు అప్పులు ఇచ్చే బ్యాంకులు స్వల్ప కాలం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పులు తీసుకుంటాయి. బ్యాంకుల దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వసూలు చేసే వడ్డీనే రెపో రేట్ అంటారు.  అందుకు బదులుగా గవర్నమెంట్ సెక్యూరిటీస్‌ని ఆర్‌బీఐకి ఇస్తారు. తీసుకున్న అప్పులకు బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి. ఆ అప్పులపై నిర్ణయించే వడ్డీనే రెపో రేట్ అంటారు. 

ఒక వేళ రెపో రేట్ పెరిగితే ఆర్‌బీఐ దగ్గర బ్యాంకులు అప్పులు తీసుకోవడానికి ముందుకు రావు అప్పుడు బ్యాంకుల దగ్గర డబ్బు తక్కువగా ఉంటాయి.  దీంతో ప్రజలకు అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు వెన‌క‌డుగు వేస్తాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయి. రెపో రేట్ తగ్గితే ఆర్‌బీఐ దగ్గర బ్యాంకులు ఎక్కువగా అప్పులు తీసుకుంటాయి. వాటిని సాధార‌ణ‌ ప్రజలకు అప్పులుగా ఇస్తాయి. ఎలాగూ ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించింది కాబట్టి బ్యాంకులు కూడా సామాన్యులకు ఇచ్చే అప్పుపై వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. ఇది రెపో రేట్లు తగ్గితే సామాన్యులకు లాభమే.

రివర్స్ రెపో రేట్ అంటే ఏంటీ?

ఆర్‌బీఐ కూడా బ్యాంకుల దగ్గర డబ్బును రుణంగా తీసుకుంటుంది. దానికి వడ్డీ చెల్లిస్తుంది. ఆ వడ్డీనే రివర్స్ రెపో రేట్ అంటారు. అంటే బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు ఇంతే వడ్డీ ఇస్తామని నిర్ణయించి ఒప్పందం చేసుకుంటుంది. ఎప్పుడూ రివర్స్ రెపో రేట్ కన్నా రెపో రేట్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రివర్స్ రెపో రేట్ ను ఆర్‌బీఐ 90 బేసిస్ పాయింట్లు తగ్గించిన‌ సంగ‌తి తెలిసిందే . దీని వ‌ల్ల సామాన్య ప్ర‌జ‌ల‌కు క‌లిగే లాభం రుణాలు విరివిగా త‌క్కువ వ‌డ్డీ రేటుకు దొరికి మ‌నం ఆర్థికంగా నిల‌దొక్కుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. 


logo