గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 18, 2020 , 01:57:55

భారతీయ చిరుత జన్యుక్రమం గుర్తింపు

భారతీయ చిరుత జన్యుక్రమం గుర్తింపు

-అంతరించిపోయిన చిరుతల పునఃసృష్టి

-ల్యాకోన్స్‌తో కలిసి ప్రయత్నిస్తామన్న సీసీఎంబీ

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: భారతదేశంలో అంతరించిపోయిన ‘చిరుత(చీతా)’ని మళ్లీ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయాలజీ (సీసీఎంబీ)తెలిపింది. భారతదేశపు చీతా జన్యుక్రమాన్ని ఇటీవలనే గుర్తించామని పేర్కొంది. మన దేశంలో చిరుతపులులు(లెపర్డ్‌) విరివిగానే ఉన్నప్పటికీ చిరుతలు మాత్రం అంతరించిపోయాయి. ఆఫ్రికన్‌ దేశాలలో విస్తృతంగా కనిపించే చిరుతలు, ఆసియా ఖండంలో ఇరాన్‌లో మాత్రమే కొంతవరకు మిగిలి ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని చిరుతపులుల జన్యుక్రమాలు వేర్వేరని సీసీఎంబీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇరాన్‌లోని చీతాల కణాలతో భారత్‌లో వాటిని మళ్లీ సృష్టించడానికి ల్యాబరేటరీ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఎండేంజర్డ్‌ స్పీషీస్‌ (ల్యాకోన్స్‌)తో కలిసికృషి చేస్తున్నామని చెప్పారు. అత్యంతవేగంగా పరుగెత్తే జంతువైన చిరుతలు స్వాతంత్య్రానికి పూర్వం మనదేశంలో విరివిగా కనిపించేవి. కానీ అడవులతోపాటే అవి కూడా అంతరించిపోయాయి. చిత్తూరులో 1953 ప్రాంతంలో చివరిసారిగా చిరుత కనిపించినట్టు రికార్డులు తెలుపుతున్నాయి. ఆ తరువాత చిరుతను అంతరించిన జంతుజాతిగా పేర్కొంటున్నారు. ఆసియా చిరుతలు ప్రస్తుతం ఇరాన్‌లో 50 వరకూ ఉన్నాయి. మన దేశంలోని జూపార్క్‌లలో ఉన్నవి ఆఫ్రికన్‌ జాతి చిరుతలు. ఇరాన్‌లోని ఆసియా జాతి చిరుత కణాలతో భారతదేశపు చిరుతకు మళ్లీ ఊపిరిపోయాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆసియా, ఆఫ్రికన్‌ జాతుల చిరుతలలో జన్యుపరమైన భేదాలపై పరిశోధనలు సాగించారు. వాటి డీఎన్‌ఏలను విశ్లేషించారు. మనదేశంలో లభ్యమైన 19వ శతాబ్దం నాటి చిరుత చర్మంనుంచి కూడాడీఎన్‌ఏను సేకరించి విశ్లేషించామని సీసీఎంబీ శాస్త్రవేత్త తంగరాజ్‌ తెలిపారు. ఈ విస్తృతమైన విశ్లేషణల అనంతరం ఈశాన్య ఆఫ్రికా ప్రాంతాలలోని చీతాలు, ఆగ్నేయ ఆఫ్రికా చీతాలు దాదాపు రెండు లక్షల సంవత్సరాల క్రితమే వేరపడి ఉంటాయని నిర్ధారణకు వచ్చామని ప్రముఖ సైంటిస్ట్‌ డాక్టర్‌ నీరజ్‌రాయ్‌ తెలిపారు. అలాగే ఆఫ్రికా, ఆసియా చీతాలు లక్ష సంవత్సరాల క్రితం వేరుపడి ఉంటాయని భావిస్తున్నామన్నారు. 


logo