చండీగఢ్, జూన్ 20: రాష్ట్రాలకు నిధుల విడుదలలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ వివక్షపై పంజాబ్ ఆప్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. గ్రామీణాభివృద్ధి ఫండ్(ఆర్డీఎఫ్)లో భాగంగా పంజాబ్‌కు చెల్లించాల్సిన బకాయిలను 10 రోజుల్లోగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేకుంటే జూలై 1న సుప్రీంకోర్టుకు వెళ్తామని సీఎం భగవంత్‌మాన్ కేంద్రాన్ని హెచ్చరించారు. రూ.3,622 కోట్ల ఆర్డీఎఫ్ నిధులను విడుదల చేయకపోవడానికి వ్యతిరేకంగా మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి గుర్మీత్ సింగ్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.
గత నాలుగు మార్కెటింగ్ సీజన్లలో పంజాబ్ నుంచి వ్యవసాయ ఉత్పతుల కొనుగోళ్లకు సంబంధించి 3 శాతం వడ్డీతో సహా ఆర్డీఎఫ్ కింద ఇవ్వాల్సిన రూ.3,622.4 కోట్లను కేంద్రం నిలుపుదల చేయడాన్ని తీర్మానం తీవ్రంగా ఖండించింది. బీజేపీయేతర రాష్ర్టాలను కేంద్రం టార్గెట్‌గా చేసుకొన్నదని, గవర్నర్లను ఉపయోగించుకొని రాష్ర్టాల్లో పాలనపై పెత్తనం చేయాలని చూస్తున్నదని సీఎం భగ్వంత్ మాన్ విమర్శించారు. ఈ తీర్మానానికి శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ), బీఎస్పీ మద్దతు తెలిపాయి. తీర్మానం ప్రవేశపెట్టక ముందే కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది.
చాన్స్‌లర్‌గా గవర్నర్‌కు చెక్!
రెండు రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆప్ సర్కార్ పలు కీలక బిల్లులను ఆమోదించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న యూనివర్సిటీలకు చాన్స్‌లర్‌గా గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రి ఉండేందుకు సంబంధించిన బిల్లు కూడా ఉన్నది. ఈ మేరకు ప్రవేశపెట్టిన ది పంజాబ్ యూనివర్సిటీస్ లాస్(సవరణ) బిల్లు-2023కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.