న్యూఢిల్లీ: టాటా గ్రూప్ మాజీ చైర్పర్సన్ రతన్ టాటా (Ratan Tata) నిజమైన లెజెండ్ అని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ కొనియాడారు. ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ వ్యాపార సంస్థల్లో అనేక దశాబ్దాలుగా టాటా గ్రూప్‌ను కీర్తి పథంలో నడిపించిన రతన్ టాటా అపారమైన అంకితభావం, దృక్పథం, చిత్తశుద్ధి కారణంగా టాటాలంటే తనకు ఎక్కువ అభిమానమని తెలిపారు. భారత పరిశ్రమపై రతన్ టాటా చెరగని ముద్ర వేశారని సంతాప సందేశంలో తెలిపారు. పరిశ్రమ దిగ్గజాలలో ఆయన ఒకరని కొనియాడారు. ‘చాలా స్పూర్తిదాయకమైన ఆయన, దివంగత జేఆర్డీ టాటాకు తగిన వారసుడిగా నిరూపించారు. అనేక సందర్భాలలో ఆయనతో సంభాషించే అవకాశం నాకు లభించింది’ అని పేర్కొన్నారు.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో తనకు భారత రత్న ప్రదానం చేసిన తర్వాత రతన్ టాటా నుంచి హృదయ పూర్వక లేఖ అందుకున్నట్లు 96 ఏళ్ల బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ గుర్తు చేసుకున్నారు. ఆయనతో తన చివరి సంభాషణ ఇదేనని తెలిపారు. రతన్ టాటా ఆప్యాయత, దాతృత్వం, దయ ఎల్లప్పుడూ చాలా మనోహరంగా ఉండేవని అన్నారు. ‘రతన్ టాటాకు దేశం రుణపడి ఉంటుంది. ఆయన నిజంగా ఒక లెజెండ్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అసంఖ్యక అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నా’ అని సంతాప సందేశంలో పేర్కొన్నారు.