Ram Mandir | అయోధ్యలో సోమవారం రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ జరుగనున్న నేపథ్యంలో గోవాలోని కాసినోల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుక గౌరవార్థం సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ గోవాలోని అన్ని కాసినోలను మూసేస్తామని ఓ కాసినో మేనేజ్మెంట్ కంపెనీ అధికారి చెప్పినట్లు పీటీఐ ఓ వార్తా కథనం ప్రచురించింది.
రాష్ట్ర రాజధాని పనాజీకి సమీపాన గల మండోవి నదీ ఒడ్డున.. ఆరు ఆఫ్షోర్ కాసినోలకు నిలయం గోవా. ఈ కాసినోల్లో కొన్నింటిని మేజిస్టిక్ ప్రైడ్ గ్రూప్ డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్ నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ.. అంటే ఎనిమిది గంటల పాటు కాసినోలు మూసేస్తున్నట్లు తెలిపారు.
జీవిత కాలంలో ఒకే ఒక్కసారి పాల్గొనే వేడుక రామ మందిర ప్రాణ ప్రతిష్ట అని శ్రీనివాస్ నాయక్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాపారాలు మూసేసి, సెలవులు ప్రకటించి ఈ వేడుకలో పాల్గొంటున్నారని, తాము వారితో భాగస్వాములం అవుతున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, అటానమస్ సంస్థలకు సోమవారం గోవా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయోధ్యలో శ్రీ రామ్ లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్ట మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం అవుతుంది. గురువారం జై శ్రీరామ్ నినాదాల మధ్య రామ మందిరంలోని గర్భ గుడిలో రామ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు.