జైపూర్: ఒక మహిళ ఆసుపత్రి వార్డులో మరణించింది. అయితే పోలీసులు వచ్చే వరకు సుమారు ఆరు గంటలకుపైగా మృతదేహాన్ని వార్డులోని బెడ్‌పై ఉంచారు. తల్లి చనిపోయిన సంగతి తెలియని చిన్నారి ఆమె నిద్రపోతున్నట్లు భావించింది. ‘అమ్మా లే’ అంటూ పలుసార్లు పిలిచింది. రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నగర్ఫోర్ట్కు చెందిన 20 ఏళ్ల షబానాకు హర్యానాలోని రివారీకి చెందిన ఒక వ్యక్తితో నాలుగేళ్ల కిందట పెళ్లి అయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు. పాప వయసు రెండేళ్లు కాగా, బాబు వయసు మూడు నెలలు.
కాగా, తన పుట్టింటికి వచ్చిన షబానా, శనివారం తీవ్ర కడుపునొప్పితో బాధపడింది. దీంతో ఆమె సోదరుడు సలీమ్, తల్లి కలిసి చికిత్స కోసం ఆమెను కోటా ఆసుపత్రికి తీసుకెళ్లాలని భావించారు. నగర్ఫోర్ట్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నైన్వాకు ఆటోలో చేరుకున్నారు. కోటా వెళ్లే బస్సు ఎక్కి కూర్చొన్నారు. అయితే షబానా ఆరోగ్యం క్షీణించింది. దీంతో బస్సు నుంచి దిగి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లారు.
మరోవైపు ఆసుపత్రి వార్డులో అడ్మిట్ చేసిన తర్వాత షబానా చనిపోయింది. దీంతో డాక్టర్లు నైన్వా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వచ్చిన ఒక పోలీస్ దీనిపై ఆరా తీశాడు. అనంతరం నగర్ఫోర్ట్ పోలీసులను పిలిపించారు.
అయితే 15 కిలోమీటర్ల దూరం నుంచి ఆ పోలీసులు వచ్చేందుకు ఆరు గంటలకుపైగా సమయం పట్టింది. అప్పటి వరకు షబానా మృతదేహాన్ని ఆసుపత్రి వార్డులోనే ఉంచారు. దీంతో అక్కడున్న మిగతా రోగులు, వారి బంధువులు ఇబ్బందిపడ్డారు. మరోవైపు చనిపోయిన తల్లిని లేపేందుకు ఆ పాప పలుమార్లు ప్రయత్నించగా అమ్మమ్మ వారించింది. ఆమె నిద్రపోతున్నదని, లేపవద్దంటూ ఆ చిన్నారితో చెప్పింది. మూడేళ్ల బాబు కూడా అప్పటి వరకు బెడ్‌పై ఉన్న తల్లి మృతదేహం పక్కనే ఉన్నాడు.
చివరకు సాయంత్రం 6.30 గంటలకు నగర్ఫోర్ట్ పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఫార్మాలిటీల అనంతరం షబానా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మరోవైపు భార్య మరణం గురించి తెలిసిన భర్త మరునాడు ఆసుపత్రికి వచ్చాడు. అయితే షబానా అనారోగ్యంతో చనిపోవడంతో ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు అతడు ఒప్పుకోలేదు. దీంతో ఆమె మృతదేహాన్ని వారికి అప్పగించారు.