Railway Rules | భారతీయ రైల్వే ఇటీవల తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్‌ను మార్చిన విషయం తెలిసిందే. రేపటి నుంచి అనగా జులై 15 నుంచి టికెట్ బుకింగ్స్ రూల్స్‌లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఐఆర్‌సీటీ వెబ్సైట్, యాప్‌లో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకునే సమయంలో ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి కానున్నది. అంటే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ఆధార్ ఓటీపీని నమోదు చేయాల్సి రానున్నది. రైల్వేశాఖ టికెట్ బుకింగ్‌లో పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో జరిగే మోసాలను ఆపేందుకు రైల్వేశాఖ కొత్త రూల్‌ని ప్రవేశపెట్టింది. ఎందుకంటే తత్కాల్ టికెట్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే.. దాదాపు అన్ని టికెట్ల నిమిషాల్లోనే బుక్ అవుతుంటాయి.
కొందరు దళారులు, ఏజెంట్లు టికెట్లన్నింటిని సాఫ్ట్వేర్, తప్పుడు మార్గాల్లో బుక్ చేస్తుండడంతో మిగతా ప్రయాణికులు టికెట్లు దొరక్క ఇబ్బందులుపడుతున్నారు. దాంతో ప్రయాణికులు మాత్రమే టికెట్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొంత వరకు మోసాలకు అడ్డుకట్ట వేసినట్లవుతుందని రైల్వేశాఖ భావిస్తున్నారు. ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకునేవారు ప్రయాణానికి ఒక ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏసీ క్లాస్ తత్కాల్ బుకింగ్ సమయం ఉదయం 10 గంటలు కాగా.. నాన్ ఏసీ ప్రయాణానికి 11 గంటలు. కొత్త నిబంధనల ప్రకారం ఏజెంట్లు ఏసీ-నాన్ ఏసీ టికెట్లను తత్కాల్ టికెట్ బుకింగ్ మొదలైన అరగంట తర్వాత మాత్రమే బుక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఏజెంట్లు ఇకపై ఏసీ టికెట్లను 10.30 గంటలకు, నాన్ ఏసీ టికెట్లు 11.30 గంటలకు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. అదే సమయంలో ప్రయాణికులు రైల్వే స్టేషన్ కౌంటర్లో నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేరసుకున్నా జులై 15 నుంచి ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
కౌంటర్లోనూ ఆధార్ ధ్రువీకరణ జరుగుతుంది. ఈ సమయంలో ప్రయాణికుడి మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి. తద్వారా ఓటీపీ వస్తుంది. మీరు వేరొకరికి టికెట్ బుక్ చేయాలనుకుంటే.. ఆ ప్రయాణికుడి ఆధార్ నంబర్‌తో పాటు ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. ఎవరికైనా ఆధార్ కార్డ్ ఉండి, టికెట్ బుకింగ్ సమయంలో ఓటీపీ రాకపోతే.. ఆ నంబర్ ఆధార్‌తో లింక్ చేయకపోతే ఐఆర్సీటీసీ హెల్ప్‌లైన్ (139)కి కాల్ చేయవచ్చని రైల్వేశాఖ పేర్కొంటున్నది. దాంతో పాటు ఆధార్ నమోదుకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే ఆధార్ హెల్ప్‌లైన్ (1947)ని సంప్రదించవచ్చని పేర్కొంది. ప్రయాణీకుడికి ఆధార్ కార్డు లేకపోతే, తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడం కష్టంగా మారనున్నది. ఎందుకంటే ఆధార్ లేకుండా టికెట్ బుక్ చేసుకోవడానికి మరో మార్గం ఏంటో మాత్రం రైల్వే వెల్లడించలేదు.