అహ్మదాబాద్: విధుల్లో ఉన్న ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బందికి తప్పనిసరిగా ట్రావెల్ అథారిటీ లేదా రైలు ప్రయాణానికి టికెట్ కొనుగోలు చేయాలని రైల్వే (Railways) స్పష్టం చేసింది. కేవలం ఐడీ కార్డు మాత్రమే ఉంటే సరిపోదని పేర్కొంది. అధికారిక విధుల్లో ఉండగా ప్రమాదం జరిగినందున పరిహారం కోరుతూ రైల్వే కానిస్టేబుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. అలాగే సిబ్బందికి డ్యూటీ కార్డ్ పాస్‌లను జారీ చేయడంలో రైల్వే నిర్లక్ష్యంపై మండిపడింది.
2019 నవంబర్ 13న జీఆర్పీ కానిస్టేబుల్ రాజేష్ బగుల్ అధికారిక విధుల కోసం గుజరాత్‌లోని సూరత్ రైల్వే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. సూరత్-జామ్‌నగర్ ఇంటర్సిటీ రైలులో బరూచ్‌కి తిరిగి వస్తుండగా పాలేజ్ స్టేషన్లో పడిపోయాడు. ఎడమ కాలుకు తీవ్ర గాయం కావడంతో మోకాలి పైభాగం వరకు తొలగించారు.
దీంతో రైల్వే విధుల్లో ఉన్న తాను ప్రమాదానికి గురయై కాలు కోల్పోయానని, వడ్డీతో సహా రూ.8 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని రైల్వేను రాజేష్ డిమాండ్ చేశాడు. దీని కోసం రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు.
కాగా, దిగాలనుకున్న స్టేషన్‌ను దాటిన తర్వాత రైలు దిగేందుకు రాజేష్ ప్రయత్నించడంతో పడిపోయి ఉండవచ్చని రైల్వే వాదించింది. అలాగే రైలులో అధికారిక ప్రయాణాన్ని నిరూపించడంలో అతడు విఫలమయ్యాడని పేర్కొంది. తప్పనిసరిగా ట్రావెల్ అథారిటీ కలిగి ఉండాలని లేదా రైలు ప్రయాణానికి సంబంధించిన టికెట్ కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నష్టపరిహారం కోసం అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను రైల్వే ట్రిబ్యునల్ కొట్టివేసింది.