ఇస్లామాబాద్: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి వెనుక అమెరికా పాత్రపై ప్రశ్నలు తలెత్తాయి. ఒక దౌత్య కేబుల్ లీక్ తో ఈ అంశం చర్చకు వచ్చింది. తమ దేశంలో అమెరికా మద్దతుతో పాలన మార్పు జరిగిందని ఇమ్రాన్ చేసిన ఆరోపణలను బలపరుస్తూ..‘సైఫర్’గా పిలిచే పత్రాన్ని పరిశోధనాత్మక సంస్థ ‘డ్రాప్ సైట్’ ప్రచురించింది. ఏప్రిల్ 2022లో ఇమ్రాన్ ఖాన్ విశ్వాస తీర్మానంలో ఓడిపోవడానికి ముందు వాషింగ్టన్లోని పాక్ రాయబారికి, ఆమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి డొనాల్డ్ లూకు మధ్య జరిగిన సమావేశ వివరాలు నమోదయ్యాయి.
‘అన్నీ క్షమించబడతాయి’ అనే పద బంధం అందులో వాడారు. పాక్-అమెరికా సంబంధాల బలోపేతానికి సంబంధించి ఆ పదాలను ఒక స్పష్టమైన సంకేతంగా భావిస్తున్నారు. అమెరికాతో తాను ఏకీభవించడానికి నిరాకరించడం వల్లే తనను పదవి నుంచి తొలగించడానికి అమెరికా తెర వెనక పని చేసిందని గతంలో ఇమ్రాన్ ఆరోపించారు.