చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జ్ హరీష్ చౌదరి పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కోరారు. సిద్ధూపై ఫిర్యాదు చేస్తూ ఏప్రిల్ 23న సోనియాకు ఆయన లేఖ రాశారు. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు పంజాబ్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆయన పరిశీలించిన అంశాలను అందులో పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నదని సిద్ధూ నిరంతరం విమర్శించేవారని, శిరోమణి అకాలీదళ్‌కు వంతు పాడేవారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిద్ధూ తీరు వివాదస్పదంగా ఉందని ఆరోపించారు. తాను ఎంత చెప్పినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని సిద్ధూ ఆపలేదన్నారు. ఈ నేపథ్యంలో సిద్ధూపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సోనియా గాంధీని కోరారు.
కాగా, సిద్ధూ ప్రస్తుత కార్యక్రమాలకు సంబంధించి పంజాబ్ కాంగ్రెస్ కొత్త చీఫ్ రాజా వారింగ్ నుంచి సవివరణ నోట్‌ను కూడా సోనియా గాంధీకి పంపినట్లు పంజాబ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరీష్ చౌదరి తెలిపారు. పార్టీకి అతీతంగా భావిస్తున్న ఆయన క్రమశిక్షణను ఉల్లంఘించి మిగతా వారికి ఉదాహరణగా నిలుస్తున్నారని విమర్శించారు. అందుకే సిద్ధూపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో అన్న దానిపై ఆయన నుంచి వివరణ కోరాలని సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. అయితే ఇదంతా పార్టీ అంతర్గత వ్యవహారమని మీడియాతో ఆయన అన్నారు.