ముంబై: బీపీవో కంపెనీలో పని చేస్తున్న మహిళ తన సహెద్యోగి నుంచి అప్పుగా డబ్బు తీసుకున్నది. తిరిగి చెల్లించకపోవడంపై అతడు ఆగ్రహించాడు. ఈ నేపథ్యంలో జనం చూస్తుండగా కత్తితో దాడి చేసి నరికాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ మరణించింది. (BPO Employee Kills Female Colleague) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. యెరవాడలోని బీపీవో సంస్థలో 28 ఏళ్ల శుభద శంకర్ కొడారే నాలుగేళ్లుగా పని చేస్తున్నది. జనవరి 7న సాయంత్రం బస్సులో అక్కడకు చేరుకున్నది. అదే కంపెనీలో పని చేస్తున్న సహోద్యోగి అయిన 30 ఏళ్ల కృష్ణ సత్యనారాయణ కనోజా కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆ సంస్థ పార్కింగ్ ఏరియాలో అంతా చూస్తుండగా కత్తితో శుభద చేతిని నరికాడు.
కాగా, కృష్ణ చేతిలోని కత్తి చూసి అక్కడున్న వారు ఆ మహిళను కాపాడేందుకు సాహసించలేదు. అయితే కొందరు వ్యక్తులు రాళ్లతో అతడిపై దాడి చేసేందుకు ముందుకు వచ్చారు. ఇది చూసి తన చేతిలోని కత్తిని అతడు కింద పడేశాడు. దీంతో వారు కృష్ణను పట్టుకుని కొట్టారు. అక్కడకు చేరుకున్న పోలీసులకు అతడ్ని అప్పగించారు.
మరోవైపు కత్తి దాడిలో గాయపడిన శుభదను ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావం వల్ల చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మృతురాలు సతారా జిల్లాలోని కరాడ్కు చెందినట్లు పోలీసులు గుర్తించారు. తండ్రికి వైద్యం కోసం నాలుగు లక్షలు అప్పుగా కృష్ణ నుంచి ఆమె తీసుకున్నదని తెలిపారు. డబ్బు తిరిగి ఇవ్వాలని కృష్ణ అడిగినా ఆమె చెల్లించలేదని చెప్పారు. ఈ వివాదం నేపథ్యంలో అతడు కత్తితో శుభదపై దాడి చేసి ఆమెను హత్య చేశాడని వివరించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ సంఘటనను మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Pune: BPO Employee Attacks Woman Colleague With Koyta Near Office; Video Captures Incident#PuneNews #Maharashtra #womenssafety pic.twitter.com/iJWBevrbDU
— Free Press Journal (@fpjindia) January 9, 2025