ఖుషీనగర్: ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్లో ఉన్న మహాపరినిర్వాణ ఆలయాన్ని ఇవాళ ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడ ఆయన అర్చన చేశారు. బౌద్ధ ఆలయంలో ఉన్న బుద్ధుడి విగ్రహానికి ఆయన చివార్ను సమర్పించారు. ఇక ఖుషీనగర్ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి వచ్చిన వివిధ దేశాలకు చెందిన బౌద్ధ సన్యాసులను కూడా ప్రధాని మోదీ సన్మానించారు. అబిద్ధామ దినాన్ని పురస్కరించుకుని ఆయన ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బౌద్ధ సన్యాసులకు చివార్ వస్త్రాలను అందజేశారు. శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, దక్షిణ కొరియా, నేపాల్, భూటాన్, కాంబోడియా దేశాలకు చెందని బౌద్ధ మతగురువులతో పాటు వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్లు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. మహాపరినిర్వాణ ఆలయం వద్ద బౌద్ధ వృక్షాన్ని మోదీ నాటారు. చరిత్రకారుల ప్రకారం బుద్ధుడు ఖుషీనగర్లోనే తన తుదిశ్వాను విడిచినట్లు తెలుస్తోంది.
అశోక చక్రవర్తి కుమారుడు మహేంద్ర, కుమార్తె సంగమిత్రలు.. తొలిసారి బుద్దుడి సందేశాలను శ్రీలంకకు చేరవేసినట్లు తెలుస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజున శ్రీలంక బౌద్ధమతాన్ని స్వీకరించిందని, అరహత్ మహేంద్ర ఇండియాకు తిరిగి వచ్చి ఈ విషయాన్ని చెప్పినట్లు ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వాతావరణ సంరక్షణ, వాతావరణ మార్పులు గురించి ఆందోళన చెందుతున్నామని, అయితే బుద్దుడి బోధనలను అనుసరిస్తే, అప్పుడు మనం ఏం చేయాలన్న సంకల్పం కలుగుతుందని, దానితోనే మార్పు సాధ్యమవుతుందని ప్రధాని అన్నారు. శ్రీలంక మంత్రి నమల్ రాజపక్షకు భగవత్గీతను మోదీ గిఫ్ట్‌గా ఇచ్చారు.