న్యూఢిల్లీ: దేశ ఆర్థిక మౌళిక సూత్రాలు బలంగా ఉన్నాయని, సరైన మార్గంలో దేశం వేగంగా ముందుకు వెళ్తోందని ప్రధాని మోదీ అన్నారు. 25వేల పాత చట్టాలను కొట్టివేశామని, మరో 1500 చట్టాలను మార్చినట్లు మోదీ తెలిపారు. వరి రైతులకు సుమారు 1.5 లక్షల కోట్లు కనీస మద్దతు ధర రూపంలో అందనున్నట్లు ఆయన చెప్పారు. యూపీఏ పాలనతో పోలిస్తే, మౌళిక సదుపాయాల పెట్టుబడి నాలుగు రేట్లు పెరిగినట్లు ఆయన తెలిపారు. స్టార్టప్‌లకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల యువత ఆవిష్కరణ వైపు మళ్లనున్నట్లు ఆయన చెప్పారు. ఆర్థిక రంగంలో డిజిటల్ రూపీ కొత్త అవకాశాలను తీసుకువస్తుందని మోదీ అన్నారు. ప్రతి గ్రామానికి ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ వస్తుందన్నారు. 5జీ టెక్నాలజీతో కొత్త యుగం ఆరంభం అవుతుందన్నారు. బడ్జెట్లో క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చామని, క్రీడా బడ్జెట్ మూడింతలు పెరిగిందని, దీని ద్వారా యువతకు లబ్ధి చేకూరుతుందన్నారు.
సరిహద్దు గ్రామాల్లో వలసలు సరికాదు అని, దీంతో దేశ భద్రతకు ముప్పు ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో బోర్డర్ గ్రామాల వృద్ధి కోసం పథకాన్ని తెచ్చినట్లు ప్రధాని వెల్లడించారు. గంగా నది పరివాహక ప్రాంతంలో నేచురల్ ఫార్మింగ్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కెన్-బెట్వా నదుల అనుసంధానంతో బుందేల్‌ఖండ్ రూపురేఖలు మారనున్నట్లు ప్రధాని తెలిపారు. ఆత్మనిర్భర్ పునాదులపై నవ భారత్‌ను నిర్మించనున్నట్లు బీజేపీ నేతలతో జరిగిన వర్చువల్ మీటింగ్‌లో చెప్పారు. కోవిడ్ మహమ్మారి ముగిసి తర్వాత కొత్త ప్రపంచాన్ని చూడబోతామని, న్యూ వరల్డ్ ఆర్డర్ ఏర్పాటు అయ్యే సంకేతాలు కనిపిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.