JK Police : జమ్మూకశ్మీర్‌లో పోలీసులు మరో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఉధంపూర్ జిల్లాలో సోమవారం తనిఖీలు జరిపిన పోలీసులు బస్తన్గఢ్ ప్రాంతంలో 15 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 400 గ్రాముల ఆర్డీఎక్స్,7.62 ఎంఎం కాట్రిడ్జ్‌లు, 5 డిటొనేటర్లు లభ్యమయ్యాయి. జమ్మూ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముకేశ్ సింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
సంఘటనా స్థలంలో కోడ్ సంతకాలు ఉన్న పేపర్ దొరికిందని, మరొక ఖాళీ కాగితం మీద నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా పేరు ఉందని ఆయన తెలిపారు. ఈ దాడికి కుట్ర పన్నిన అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి బసంత్‌గఢ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు చేపట్టామని రామ్‌నగర్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి భిషమ్ దూబే తెలిపారు.