కోల్కతా: ప్రధాని నరేంద్ర మోదీకి కూడా శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స గతే పడుతుందని పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ విమర్శించారు. కోల్కతాలోని సీల్దా మెట్రో స్టేషన్ను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోమవారం ప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం మమతా బెనర్జీని ఆహ్వానించలేదు. ఇటీవల విక్టోరియా మెమోరియల్లో జరిగిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యక్రమానికి కూడా సీఎం మమతను పిలువలేదు.
ఈ నేపథ్యంలో కేంద్రం తీరుపై టీఎంసీ మండిపడింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ మీడియాతో ఆదివారం మాట్లాడారు. సీల్దా మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవానికి సీఎం మమతా బెనర్జీని ఆహ్వానించకపోవడం అన్యాయమని విమర్శించారు. ఆమె రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విభజన రాజకీయాల వల్ల ప్రధాని నరేంద్ర మోదీకి కూడా శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స గతే పడుతుందని మండిపడ్డారు. శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అధ్యక్షుడి భవనాన్ని నిరసనకారులు శనివారం ముట్టడించారు. అయితే దీనికి ముందే ఆ భవనాన్ని వీడిన రాజపక్స శ్రీలంకను విడిచి పారిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు సీఎం మమతను ఆహ్వానించకపోవడాన్ని బీజేపీ సమర్థించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను టీఎంసీ ఆహ్వానించడంలేదని విమర్శించింది. ఈ సంప్రదాయాన్ని టీఎంసీనే ప్రారంభించిందని బీజేపీ ఆరోపించింది.