న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) రెండు రోజుల పాటు సౌదీ ఆరేబియాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం ఆయన సౌదీకి బయలుదేరి వెళ్లారు. జెడ్డాలో ఆ దేశంతో ఆరు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సౌదీ ఆరేబియా చక్రవర్తి మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్‌తో జరిగే చర్చల్లో భారతీయ యాత్రికులకు చెందిన హజ్ కోటా గురించి మాట్లాడనున్నారు. సౌదీ ఆరేబియాతో సుదీర్ఘ కాలం నుంచి విలువైన సంబంధాలు కలిగి ఉన్నట్లు మోదీ తెలిపారు. సౌదీకి బయలుదేరి వెళ్లడానికి ముందు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇటీవల రెండు దేశాల మధ్య బంధం మరింత దృఢమైందన్నారు. రక్షణ, వాణిజ్య, పెట్టుబడి, ఎనర్జీ రంగాల్లో సహకారం పెరిగిందన్నారు. ప్రాంతీయంగా శాంతి, సామరస్యం, స్థిరత్వం ప్రమోట్ చేసేందుకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మూడోసారి మోదీ సౌదీకి వెళ్తున్నారు. ఆయన జెడ్డాకు వెళ్లడం ఇదే మొదటిసారి. రెండవ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొనున్నారు.
భారత్ నుంచి హజ్ వెళ్లే యాత్రికుల కోటా ఈ యేడాది 1,75,025గా ఉన్నది. 2014లో ఆ కోటా 1,36,020 మాత్రమే ఉండేది. అయితే ఈ యేడాది ఇప్పటికి కేవలం 1,22,518 మంది యాత్రికులకు ఏర్పాట్లు చేశారు. హజ్ గ్రూపు ఆపరేటర్స్ అగ్రిమెంట్లో జాప్యం వల్ల సుమారు 42 వేల మంది భారతీయ ముస్లింలు ఈ యేడాది హజ్ యాత్ర చేపట్టలేకపోతున్నారు. 2016లో సౌదీ అరేబియా అత్యున్నత పౌర పురస్కారాన్ని మోదీ అందుకున్న విషయం తెలిసిందే. ఈసారి ఆయన తన పర్యటనలో భాగంగా భారతీయ కార్మికులు పనిచేస్తున్న ఫ్యాక్టరీకి వెళ్లనున్నారు.