న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: సామాన్యుడి నడ్డివిరుస్తూ పరుగులు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు గత 102 రోజులుగా స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలకు అనూహ్యంగా రెక్కలొచ్చాయి. అయినప్పటికీ, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం పెరుగుదల నమోదవ్వలేదు. ఎందుకు?
ఆర్థిక లెక్కలు కాదు.. రాజకీయ లెక్కలే 2021 డిసెంబర్ 1న అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 65 డాలర్లుగా ఉండేది.
అప్పుడు దేశంలో లీటరు పెట్రోల్ రూ.108.20, లీటరు డీజిల్ రూ. 94.62. కరోనా కల్లోలం, చమురును ఉత్పత్తి చేసే రెండో పెద్ద దేశం రష్యా, ఉక్రెయిన్ మధ్య తాజా ఉద్రిక్తతలు, పెట్రోల్, డీజిల్ భాండాగారంగా పిలిచే యూఏఈపై గతనెలలో డ్రోన్ల దాడి జరుగడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు 96-97 డాలర్లు పలుకుతున్నది. అంతర్జాతీయ మార్కెట్ల ధరలకు అనుగుణంగా దేశంలో ప్రస్తుతం చమురు ధరలు కూడా పెరుగాలి. అయితే అలా జరుగలేదు.
దీనికి కారణం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటమే. ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే అది బీజేపీ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపించవచ్చని భావించిన మోదీ సర్కారు ఇంధన ధరలను పెంచలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంధన ధరలను ప్రస్తుతం రాజకీయాలే నియంత్రిస్తున్నాయని, ఆర్థిక లెక్కలను బట్టి కాకుండా రాజకీయ లెక్కలను బట్టి చమురు ధరలు నిర్ణయిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.
ఆర్థికాభివృద్ధిపై ప్రభావం
85 శాతం చమురును విదేశాల నుంచే భారత్ దిగుమతి చేసుకొంటున్నది. బ్యారెల్ ముడి చమురు ధర 10 డాలర్లు పెరిగితే అది దేశ ఆర్థికాభివృద్ధిపై 0.3 నుంచి 0.35 శాతం ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదలతో పాటు కేంద్రం విధించే అదనపు సుంకాలు మధ్యతరగతి జీవులకు రానున్న కాలంలో పెనుభారంగా మారనున్నట్టు ఆందోళన వ్యక్తమవుతున్నది.
మార్చి 7 తర్వాత వడ్డింపే!
ఐదు రాష్ర్టాల ఎన్నికలు వచ్చే నెల 7తో ముగియనున్నాయి. ఆ తర్వాత ఇంధన ధరలపై వడ్డింపు ఉండబోతున్నట్టు పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. లీటరు పెట్రోల్‌పై కనీసం రూ. 8-9 చొప్పున పెంచబోతున్నట్టు డెలాయిట్ అధ్యయనం ఇటీవల వెల్లడించింది. ఎన్నికల అనంతరం ఇంధన ధరలు పెరుగుతాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రిసెర్చ్, ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ అబ్జర్వ్స్ కూడా అభిప్రాయపడ్డాయి. పెట్రోల్ ధరల్లో అనూహ్య పెరుగుదలతో ద్రవ్యోల్బణంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి.