న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లు(Cycle Tracks) నిర్మించాలంటూ దాఖలైన పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సైక్లింగ్ ప్రమోటర్ దేవిందర్ సింగ్ నాగి వేసిన పిటీషన్‌పై ధర్మాసనం విచారించింది. ప్రజలకు ఇండ్లు నిర్మించేందుకు ప్రభుత్వాల వద్ద సరిపోను నిధులు లేవని, బస్తీ ప్రజలకు మంచినీళ్లు కూడా అందించలేకపోతున్నారని, ఇలాంటి సందర్భాల్లో మీకు సైకిల్ ట్రాక్‌లు కావాలని పగటి కలలు కంటున్నారా అని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది.
జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, ఉజ్వల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్‌ను విచారించింది. ప్రజలకు కావాల్సిన ప్రాముఖ్యతలపై దృష్టి పెట్టాలని, అవసరమైన ఇతర అర్జెంట్ అంశాలను ప్రభుత్వాలు పట్టించుకోవాలని ధర్మాసనం తెలిపింది. మురికి వాడలకు వెళ్లండి.. అక్కడ ప్రజలు ఏ స్థితిలో బ్రతుకుతున్నారో చూడండి, ప్రజలకు ఇండ్లు కట్టించేందుకు ప్రభుత్వం వద్ద కావాల్సినంత డబ్బు లేదు, కానీ మీరు మాత్రం సైక్లింగ్ ట్రాక్‌ల గురించి కలలు కంటున్నారని కోర్టు పేర్కొన్నది.
ప్రజలకు ప్రాథమిక వసతులు లేవని, మీరు మాత్రం సపరేటు సైకిల్ ట్రాక్‌లు కావాలని కోరుతున్నారని కోర్టు తెలిపింది. ప్రాముఖ్యతల విషయంలో తప్పుదోవ పడుతున్నామని, మన ప్రాధాన్యతలను సరైన మార్గంలో పెట్టాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని, ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు అందడం లేదని, ప్రభుత్వ స్కూళ్లను మూసివేస్తున్నారని, ఇలాంటి టైంలో మీకు సైకిల్ ట్రాక్‌లు కావాల్సి వస్తోందా అని కోర్టు మందలించింది.
అనేక రాష్ట్రాల్లో సైకిల్ ట్రాక్‌లు ఉన్నాయని, సుప్రీంకోర్టు బయట కూడా ఓ సైకిల్ ట్రాక్ ఉన్నట్లు పిటీషనర్ దేవిందర్ పేర్కొన్నారు.