ముంబై: ఇద్దరు స్నేహితులు పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన ఒక వ్యక్తి కోపంతో ఫ్రెండ్ చెవి కొరికాడు. (Man Bites Off Friend’s Ear) తెగిన భాగాన్ని మింగేశాడు. చెవి తెగిన ఫ్రెండ్ హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స పొందాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహారాష్ట్రలోని థానేలో ఈ సంఘటన జరిగింది. హీరానందాని ఎస్టేట్‌లోని సాలిటైర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో 37 ఏళ్ల సినీ నిర్మాత శ్రావణ్ లీఖా, 32 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ వికాస్ మీనన్ నివసిస్తున్నారు.
కాగా, ఫిబ్రవరి 26న శ్రావణ్ తన స్నేహితులైన వికాస్, మరో వ్యక్తితో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఈ సందర్భంగా వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన వికాస్ మీనన్ తన ఫ్రెండ్ శ్రావణ్ చెవిని నోటితో కొరికాడు. తెగిన చెవి భాగాన్ని మింగేశాడు. తెగిన చెవి నుంచి రక్తం కారడంతోపాటు ఆ బాధతో శ్రావన్ అల్లాడిపోయాడు. సమీపంలోని హాస్పిటల్‌కు వెళ్లి ప్రాథమిక చికిత్స పొందాడు.
మరోవైపు శ్రావణ్ ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. చెవి కొరికిన ఫ్రెండ్ వికాస్‌కు అంత కోపం ఎందుకు వచ్చిందో తనకు తెలియదని చెప్పాడు. తెగిన చెవికి సర్జరీ కోసం సుమారు రూ.5 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో వికాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.