Parrot : సేలం (Selam) సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ రామ చిలుక (Parrot) ను పెంచుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జైలు సూపరింటెండెంట్ ఆ రామచిలుకను స్వాధీనం చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. సూపరింటెండ్ ఆదేశాల మేరకు రామ చిలుకను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లి జైలు వార్డర్స్ (Jail warders) పై ఆ ఖైదీ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై అస్తం పట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సేలం సెంట్రల్ జైల్లో తిరునల్వేలి జిల్లా సుత్తమల్లి గ్రామానికి చెందిన శివలబెరియన్ (37) అనే యావజ్జీవ ఖైదీ ఉన్నాడు. అతను ఓ చిలుకను పెంచుతున్నట్లు జైలు సూపరెండెంట్ వినోద్‌కుమార్‌కు తెలిసింది. ఆయన ఆదేశాల మేరకు బుధవారం జైలర్ రాజేంద్రన్, వార్డర్స్ మాయవన్ వెళ్లి చిలుకను అప్పగించాలని శివలబెరియన్ను కోరారు. దాంతో ఆగ్రహించిన ఖైదీ వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో వార్డర్ మాయవన్ స్పృహ కోల్పోయారు.
వెంటనే జైలులో ఉన్న వైద్యసిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స చేసి, సేలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం చిలుకను స్వాధీనం చేసుకున్న జైలు అధికారులు వార్డర్‌పై జరిగిన దాడిపై అస్తంపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా జైలులో ఓ ఖైదీ చిలుకను పెంచుతున్నా ఇన్నాళ్లు పట్టించుకోని జైలర్ రాజేంద్రన్, సబ్ జైలర్ శివ, వార్డర్స్ రాజశేఖర్, ముత్తుకుమార్, తిరునావుక్కరసు, మహేంద్రన్లకు సూపరింటెండెంట్ వినోద్‌కుమార్ మెమో జారీచేశారు.