Govt Teacher | భోపాల్ : ప్రభుత్వ ఉద్యోగం పోతుందన్న భయంతో ఓ టీచర్ తన భార్యతో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. నాలుగో సంతానంలో పుట్టిన పండంటి మగబిడ్డను బండరాయి కింద పాతిపెట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చింధ్వారా జిల్లాలోని నందన్‌వాడీ గ్రామంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నందన్‌వాడీ గ్రామ సమీపంలోని ఓ గుట్టపై గత నెల 28వ తేదీన తెల్లవారుజామున ఓ శిశువు ఏడుపు వినిపించింది. మార్నింగ్ వాకర్స్ ఆ శిశువు ఏడుపును పసిగట్టి అక్కడికి వెళ్లారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న శిశువు బండరాళ్ల కింద పాతిపెట్టి ఉండడాన్ని చూసి స్థానికులు షాక్ అయ్యారు. తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. చలికి వణికిపోతున్న మూడు రోజుల పసికందును చేరదీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఆ తర్వాత శిశువు తల్లిదండ్రులు బబ్లు దండోలియా(38), భార్య రాజకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ఇప్పటికే తమకు ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిపారు. తాను ప్రస్తుతం నందన్‌వాడీ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నట్లు దండోలియా పోలీసులకు తెలిపాడు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం.. ఏ ఉద్యోగికి ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండకూడదు. దీంతో నలుగురు పిల్లలు అని ప్రభుత్వానికి తెలిస్తే తన ఉద్యోగం పోతుందనే భయంతోనే మూడు రోజుల పసికందును బండరాయి కింద పాతిపెట్టినట్లు దండోలియా దంపతులు పోలీసులకు తెలిపారు.
దండోలియా దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు శిశువు, తల్లిదండ్రుల డీఎన్ఏ పరీక్షకు నమూనాలు పపించారు. ఆ రిపోర్టు రాగానే పేరెంట్స్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. అడవిలో రాళ్ల కింద ఆ పిల్లవాడు వణుకుతూ కనిపించాడని పోలీసులు తెలిపారు. శిశువుపై చీమలు పాకుతున్నయాని, ఒళ్లంతా గాయాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం శిశువు కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రుల విషయంపై స్పష్టత వచ్చే వరకు శిశువు ప్రభుత్వ సంరక్షణలోని శిశు గృహంలో ఉంచామని పేర్కొన్నారు.
అయితే 2001 జనవరి 26 తర్వాత మూడో సంతానం పుడితే ఉద్యోగం తొలగించేలా మధ్యప్రదేశ్ విద్యాశాఖలో నిబంధన ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి గోపాల్ సింగ్ బఘేల్ తెలిపారు. జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వం ఈ నియమాలను తీసుకొచ్చినట్లు చెప్పారు. అయితే కొంతమంది కోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందుతున్నారని పేర్కొన్నారు.