లాహోర్: పాకిస్థాన్, భారత్‌కు బద్ధ శత్రువన్న సంగతి తెలిసిందే. ఆ దేశాధినేతలు భారత్ పట్ల ఎప్పుడూ తమ అక్కసను వెళ్లగక్కుతుంటారు. కయ్యానికి కాలు దువ్వుతుంటారు. ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా దీనికి మినహాయింపు కాదు. అయితే అనూహ్యంగా ఆయన భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇండియా ఐటీ రంగం అభివృద్ధిని తన నోటితో కొడియాడారు. ఈ నెల 23న లాహోర్‌లో స్పెషల్ టెక్నాలజీ జోన్ (ఎస్టీజెడ్)ను ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. 15-20 ఏండ్లలో భారత్ టెక్ ఎగుమతులు 150 బిలియన్ డాలర్లకు పెరిగాయని కొనియాడారు. అయితే పాకిస్థాన్ కేవలం 2 బిలియన్ డాలర్లకే చేరుకున్నదని అన్నారు. ‘దురదృష్టవశాత్తు, యువ జనాభాతో సహా ఆదర్శవంతమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, పాకిస్థాన్ ఈ రంగంలో వెనుకబడి ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, కరోనా మహమ్మారి వల్ల అన్ని వ్యాపారాలు తిరోగమనాన్ని ఎదుర్కొన్నాయని, అయితే గూగుల్, అమెజాన్, ఇతర టెక్ కంపెనీల లాభాలు మరింతగా పెరిగాయని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో టెక్ పరిశ్రమ ఎగుమతులను పెంచడం ద్వారా దేశ కరెంట్ ఖాతా లోటును అధిగమించడంతోపాటు ఈ రంగాన్ని ప్రోత్సహించి, సులభతరం చేస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు.
మరోవైపు అదే వేదికపై చైనాను కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు. చైనా పేదరిక నిర్మూలన మిషన్‌ను కొనియాడారు. దాదాపు 700 మిలియన్ల మంది ప్రజలను పేదరికం నుండి బయటపడేసిందని గొప్పలు పోయారు. అవినీతిని నిర్మూలించడం, 450 మంది మంత్రుల స్థాయి వ్యక్తులను జైలులో పెట్టడం, ఎగుమతులను మెరుగుపరచడం ద్వారా పొరుగున ఉన్న చైనా పేదరిక వ్యతిరేక మిషన్‌లో అపారమైన పురోగతిని సాధించిందని అన్నారు. ఆ దేశ అభివృద్ధి నమూనాను ఆయన ప్రశంసించారు.