Article 370 | పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370పై కాంగ్రెస్ కూటమి వైఖరితో తమ దేశం ఏకీభవిస్తుందని వ్యాఖ్యానించారు. దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో బుధవారం ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ మేనిఫెస్టోలో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర స్టేటస్ పునరుద్ధరణపై ప్రస్తావించింది. అయితే, ఆర్టికల్ 370పై మాత్రం మౌనం వహించింది. అయితే, పాక్లో జరిగిన ఓ టీవీ కార్యక్రమంలో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై అడిగిన ఓ ప్రశ్నకు స్పందించారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయన్నాయని.. ఆ పార్టీలకే విజయ అవకాశాలున్నాయన్నారు.
కశ్మీర్లో ఆర్టికల్ 370, 35ఏ అమలు చేసిన సమయంలో కేంద్రంలో కాంగ్రెస్కు చెందిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ, కశ్మీర్లో షేక్ అబ్దుల్లా అధికారంలో ఉన్నారని చెప్పారు. తాజాగా ఇద్దరు కలిసి కశ్మీర్లో ఆర్టికల్ 370, 35ఏ అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇది జరిగితే చాలా బాగుంటుందని.. ఆర్టికల్ 370, 35ఏపై కాంగ్రెస్, దాని మిత్రపక్షాల స్టాండ్తోనే తాము ఉన్నామన్నారు. పాక్ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో దేశ రాజకీయాలు మరోసారి వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ ఇప్పటికే అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ నేత అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో స్పందిస్తూ పాక్ ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తున్న దేశమని.. ఆ దేశం కశ్మీర్ విషయంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ వైఖరికి మద్దతు ఇస్తుందని విమర్శించారు.