Water Bottle | హైదరాబాద్, డిసెంబర్ 3 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): తాగునీటి ద్వారా వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్లాస్టిక్ క్యాన్స్, బాటిల్స్‌లో అమ్మే ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్‌ను ‘హై-రిస్క్ ఫుడ్’ క్యాటగిరీలో చేర్చింది. మినరల్ వాటర్‌ను తయారుచేసే కంపెనీలకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సర్టిఫికెట్ తప్పనిసరి కాదంటూ గత అక్టోబర్‌లో కేంద్రప్రభుత్వం నిబంధనలు సడలించిన నేపథ్యంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఏదైనా పదార్థాన్ని ‘హై-రిస్క్ ఫుడ్’ క్యాటగిరీలో చేర్చారంటే అధికారులు దాన్ని లోతుగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్‌ను హై-రిస్క్ క్యాటగిరీలో చేర్చటం ద్వారా వాటి భద్రత, నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడినట్టు భావించవచ్చు. మినరల్ వాటర్ తయారీ కంపెనీల్లో ప్రతి ఏటా తనిఖీలు నిర్వహించిన తర్వాతే ఆయా కంపెనీల లైసెన్స్‌ను అధికారులు రెన్యువల్ చేస్తారు. పాలు, పాల పదార్థాలు, మాంసం, చేపలు, గుడ్లు, ఆహార పదార్థాలు, స్వీట్లు తదితరాలను ఇప్పటికే ఎఫ్ఎస్ఎస్ఏఐ ‘హై-రిస్క్ ఫుడ్’ క్యాటగిరీలో చేర్చింది.