Owasi | మహిళల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏండ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. కేంద్రం నిర్ణయం హాస్యాస్పదం అని శుక్రవారం వ్యాఖ్యానించారు. ఇది పితృస్వామ్య వ్యవస్థను ప్రోత్సహిస్తుందన్నారు. చట్టబద్ధంగా స్త్రీ పురుషులు పెండ్లి చేసుకోవడానికి 18 ఏండ్ల వయస్సును అనుమతించాలన్నారు. 18 ఏండ్లు దాటిన తర్వాత వారు యువజనులు చట్టబద్ధమైన పనులు చేసేందుకు అర్హులవుతారన్నారు.
మోదీ సర్కార్ మొహల్లా అంకుల్లా వ్యవహరిస్తున్నదని ఒవైసీ ఆరోపించారు. భారతీయులు ఏం తినాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.. ఎప్పుడు పెండ్లి చేసుకోవాలో నిర్దేశిస్తుంది… ఏ దేవుడ్ని పూజించాలో చెబుతుందని వ్యాఖ్యానించారు. ఇది పితృస్వామ్య వ్యవస్థను ప్రోత్సహించడమే నన్నారు. డేటా బిల్లుకు ఆమోదం పొందడానికి 18 ఏండ్ల వయస్సును గడువుగా నిర్దేశించిన సర్కార్.. వారి జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకోవడానికి దాన్ని ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు.
In many US states, marriage age is as low as 14. In UK & Canada, it’s 16. In NZ, 16-19 year olds can marry with parental consent. These nations improved human development of young people so that they can take INFORMED decisions rather than fixing arbitrary age restrictions 10/n
— Asaduddin Owaisi (@asadowaisi) December 17, 2021
18 ఏండ్లు దాటిన మహిళలు, పురుషులు కాంట్రాక్టులపై సంతకాలు చేయొచ్చు. వ్యాపారాలు చేయొచ్చు. ప్రధానులను ఎంచుకోవచ్చు. ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకోవచ్చు. కానీ వివాహం చేసుకోవద్దని ఒవైసీ ట్వీట్ చేశారు. మహిళల వివాహ వయస్సును 18 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు పెంచుతూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.