భోపాల్: వధువుకు సరిగా మేకప్ వేయనందుకు ఆమె కుటుంబం బ్యూటీషియన్ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పెండ్లి కుమార్తె రాధికా సేన్‌కు మేకప్ కోసం ఆమె కుటుంబ సభ్యులు మోనికా పాఠక్ అనే బ్యూటీషియన్‌ను సంప్రదించారు. అయితే పెళ్లి రోజున ఆమె అందుబాటులో లేదు. వధువుకు మేకప్ కోసం జూనియర్ మేకప్ ఆర్టిస్ట్‌ను పంపింది.
కాగా, పెళ్లి కుమార్తె రాధికా సేన్‌కు జూనియర్ ఆర్టిస్ట్ సరిగా మేకప్ వేయలేదు. దీంతో అసంతృప్తి చెందిన వధువు కుటుంబ సభ్యులు మోనికాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. ఈ సందర్భంగా వధువు కుటుంబ సభ్యులను ఆమె దుర్భాషలాడింది. అలాగే డబ్బులు చెల్లింపుపై వారిని బెదిరించింది.
ఈ నెల 3న జరిగిన ఈ సంఘటనపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యూటీషియన్ మోనికాను ప్రశ్నించిన తర్వాత ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు.