న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: తన ఉద్యోగుల సంఖ్యపై భారీగా కోత విధించాలని సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ యోచిస్తున్నది. ఓపెన్ ఏఐతో 30,000 కోట్ల డాలర్ల భాగస్వామ్యం వల్ల ఏర్పడిన ఆర్థిక భారమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ టీడీ కోవెన్ నివేదిక ప్రకారం 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని ఒరాకిల్ భావిస్తున్నది. ఈ చర్య వల్ల 800 కోట్ల నుంచి 1000 కోట్ల డాలర్ల వరకు నగదు ఆదా అవుతుందని కంపెనీ అంచనావేసింది.
ఆల్ట్మాన్ కంపెనీ కోసం ఏఐ డాటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు నిధుల కోసం అల్లాడుతున్న ఒరాకిల్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం ద్వారా నిధులను సమీకరించుకోవచ్చని యోచిస్తున్నది. ఓపెన్ ఏఐ డాటా సెంటర్ల ఏర్పాటు కోసం ఒరాకిల్ దాదాపు 15,600 కోట్ల డాలర్ల పెట్టుబడి పెడుతున్నది. అంతేగాక మరో 30 లక్షల జీపీయూలను(గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు) సమకూరుస్తున్నది. గత రెండు నెలల్లోనే 5,800 కోట్ల డాలర్ల అప్పు ఒరాకిల్ చేసింది. టెక్సాస్, విస్కాన్సిన్లో డాటా సెంటర్ల కోసం 3,800 కోట్ల డాలర్లు, న్యూ మెక్సికోలోని క్యాంపస్ కోసం 2,000 కోట్ల డాలర్ల రుణాన్ని ఒరాకిల్ తీసుకుంది. ప్రస్తుతం ఒరాకిల్ మొత్తం అప్పు దాదాపు 10,000 కోట్ల డాలర్లని అంచనా.