న్యూఢిల్లీ, డిసెంబర్ 15: చాట్‌జీపీటీని సృష్టించిన ఓపెన్ఏఐ సరికొత్త ఏఐ టూల్‌ను ఆవిష్కరించింది. టెక్ట్స్ ప్రాంప్ట్‌ల(కృత్రిమ మేధ లాంగ్వేజీ మోడల్స్‌కు ఇచ్చే నిర్దిష్టమైన కీ వర్డ్స్ లేదా వాక్యాలు) నుంచి వీడియోలను తయారుచేసే ‘సోరా’ను ఆవిష్కరించింది. ఈ టూల్ అమెరికా, ఇతర దేశాల మార్కెట్లలోని చెల్లింపు వినియోగదారులకు అందుబాటులో ఉందని తెలిపింది. ఈ కొత్త రకం టూల్ 20 సెకన్ల నిడివి గల వీడియో క్లిప్స్‌ను బహుళ సంఖ్యలో వైవిధ్యంగా రూపొందించగలదు.
ఈ టూల్‌తో చౌకగా వీడియో క్లిప్‌లను తయారు చేయవచ్చు. ఆరంభంలో సోరా లభ్యత పరిమితంగా ఉంటుందని ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ తెలిపారు. స్టిల్ చిత్రాలు, వీడియోలు, టెక్ట్స్ ప్రాంప్ట్స్ల నుంచి సోరా వీడియోలను ఉత్పత్తి చేస్తుందని ఓపెన్ఏఐ పేర్కొంది. యూజర్ ఏదైనా వీడియో క్లిప్ అప్లోడ్ చేస్తే సోరా దాని ఫుటేజీని విభజించి నిడివిని పెంచుతుంది. ఈ టూల్లో స్టోరీ బోర్డ్ ఆప్షన్‌తో పాటు ఇతరులు సృష్టించిన వీడియోలను అన్వేషించే సదుపాయం ఉంది. ఈ టూల్ వల్ల హాలీవుడ్లో చాలా మంది ఉపాధికి గండి పడే ప్రమాదం ఉందని భయాలు వ్యక్తం అవుతున్నాయి.