తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న శ్రీ పద్మనాభస్వామి ఆలయం(Sree Padmanabha Swamy Temple)లోని నేలమాలిగకు చెందిన ‘బీ’ గదిని తెరవాలని డిమాండ్ వచ్చింది. గురువారం జరిగిన టెంపుల్ అడ్వైజరీ కమిటీ, టెంపుల్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మీటింగ్లో ఈ అంశంపై చర్చ జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఎం వేలప్పన్ నాయర్ ఆ మీటింగ్లో మాట్లాడారు. నేలమాలిగలోని ‘బీగదిని తెరువాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ మిగితా సభ్యులు ఎవరూ ఆ ప్రతిపాదనకు స్పందించలేదు. నేలమాలిగల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఆలయ ప్రధాన అర్చకుడు గురువారం జరిగిన సమావేశానికి హాజరుకాలేదు. ఆలయం నైరుతీ దిక్కున్న ఏ, బీ గదులు ఉన్నాయి. ఓ గది ఉత్తరం దిక్కుకు, ఓ గది దక్షిణ దిక్కుకు ఉంటాయి. ఆలయంలోని శ్రీ పద్మనాభస్వామి వారి శిరస్సు ప్రాంతంలో ఆ గదులు ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. జూన్ 2011లో నేలమాలిగలోని ఏ గదిని తెరిచారు. ఆ గదిలో ఉన్న సంపదను ఇన్వెంటరీలో ఎక్కించారు. అయితే బీ గది తెరిచే అంశంలో తీవ్ర అభ్యంతరాలు గతంలో వ్యక్తం అయ్యాయి. ఆ గదిని ఓపెన్ చేసే నిర్ణయం టెంపుల్ అడ్మినిస్ట్రేటివ్, అడ్వైజరీ కమిటీలకు వదిలేశారు.