Karnataka | బెంగళూరు, జూన్ 23: కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు పరాభవం ఎదురైన నేపథ్యంలో అదనపు డిప్యూటీ సీఎంల లొల్లి మళ్లీ తెరపైకి వచ్చింది. ఉపముఖ్యమంత్రి పదవుల కోసం ప్రజాపనుల మంత్రి సతీశ్ జార్కిహోళి, సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. సీఎం సిద్ధరామయ్యపై వారు ఒత్తిడి తెస్తున్నారు. సతీశ్ జార్కిహోళి, కేఎన్ రాజన్న ఎస్టీ వర్గానికి చెందినవారు కాగా, జమీర్ అహ్మద్‌ఖాన్ ముస్లిం. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీలో మళ్లీ అంతర్గత పోరు మొదలైంది.
సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నాయకత్వంలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28 స్థానాలకుగానూ 9 సీట్లను మాత్రమే గెలిచింది. సీఎం సొంత జిల్లా మైసూర్లో పార్టీ ఓటమిపాలైంది. అలాగే బెంగళూరు రూరల్ స్థానంలో తన సోదరుడు డీకే సురేశ్‌ను శివకుమార్ గెలిపించుకోలేకపోయారు.
అదనపు డిప్యూటీ సీఎంల పోస్టులు ఏర్పాటు చేయాలనే డిమాండ్ లోక్‌సభ ఎన్నికల ముందు నుంచి ఉన్నది.సీనియర్ మంత్రులు జీ పరమేశ్వర, సతీశ్ జార్కిహోళి, హెచ్‌సీ మహదేవప్ప, రాజన్న, కేహెచ్ మునియప్ప తదితరులు డిన్నర్ మీటింగ్ కూడా నిర్వహించారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అంతర్గత పోరు ఉన్నదనే ప్రచారం నేపథ్యంలో సిద్ధరామయ్యకు సన్నిహితులైన మంత్రుల నుంచి ఈ ‘అదనపు డిప్యూటీ సీఎంల’ డిమాండ్ తెరపైకి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. హైకమాండ్ ఈ డిమాండ్లను తోసిపుచ్చింది. అదనపు డిప్యూటీ సీఎంలను నియమిస్తే పార్టీలో డీకే ఆధిపత్యం తగ్గిపోతుందని భావిస్తున్నది. మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం సిద్ధరామయ్యను తప్పిస్తుందనే ప్రచారముంది.