
న్యూఢిల్లీ : రోజు రోజుకు దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతున్నది. ఇప్పటి వరకు భారత్‌లో దాదాపు ఐదువేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మహమ్మారి బారినపడ్డ వారిలో చాలా తక్కువ మందిలో లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో టాటా కంపెనీ శుభవార్త చెప్పింది. వేరియంట్ సోకిందో.. లేదో తెలుసుకునేందుకు టెస్ట్ కిట్ ఒమిష్యూర్ (OmiSure) టెస్ట్ కిట్‌ను తయారు చేసినట్లు ప్రకటించింది. ఈ కిట్ ఇవాళ్టి నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నది.
ఒమిక్రాన్ (Omicron) టెస్ట్ కిట్ (OmiSure)ను టాటా మెడికల్ తయారు చేసింది. టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ కంపెనీ ఒమిక్రాన్ టెస్ట్ కిట్‌ను డిసెంబర్ 30న ఐసీఎంఆర్ ఆమోదించింది. ఒమిష్యూర్ టెస్ట్ కిట్ ఇతర ఆర్టీ పీసీఆర్ టెస్ట్ కిట్ మాదిరిగానే పని చేస్తుంది. కిట్‌తో పరీక్ష కోసం ముక్కు, నోటి నుంచి సేకరించిన నమూనాలతో చేసుకుంటే 10 నుంచి 15 నిమిషాల్లోనే వైరస్ సోకిందా? లేదా? తెలిసిపోతుంది.
టాటా మెడికల్ ఒమిష్యూర్ టెస్ట్ కిట్ (OmiSure) ధరను ఒక్కో పరీక్షకు రూ.250గా నిర్ణయించింది. ప్రస్తుతం ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర టెస్ట్ కిట్ల కంటే చౌకగానే ఉంటుంది. అయితే, ఇది ఇంట్లో చేసుకునే పరీక్ష కానందున ల్యాబ్ ఫీజు అదనంగా వసూలు చేయనున్నారు. టాటా కంపెనీ ప్రస్తుతం నెలకు రెండు లక్షల కిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండగా.. వాటిని విదేశాలకు సైతం ఎగుమతిచేయాలని భావిస్తున్నది.
ఇందులో భాగంగా యూరోపియన్ యూనియన్, యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసింది. ఇదిలా ఉండగా.. ఒడిశా స్టేట్ మెడికల్ కార్పొరేషన్ లిమిటెడ్ (OSMCL) ఐదు లక్షల ఒమిష్యూర్ కిట్ల కోసం ఆర్డర్ చేసింది. దేశంలోనే కొవిడ్-19 పాజిటివ్ శాంపిల్స్‌లో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించేందుకు కిట్లను ఆర్డర్ చేసిన మొదటి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది.