Coaching center tragedy : దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజెందర్ నగర్ (Old Rajender Nagar) లోగల సివిల్స్ కోచింగ్ సెంటర్ (Coaching center) సెల్లార్లోకి వరద నీరు చేరి ముగ్గురు యూపీఎస్సీ విద్యార్థులు మృతిచెందిన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ కేసులో కోచింగ్ సెంటర్ యజమాని, కోఆర్డినేటర్ సహా మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు (Delhi police).. ఇవాళ తీస్ హజారీ కోర్టు (Tis Hazari Court) లో ప్రవేశపెట్టారు.
కేసుకు సంబంధించి పలు వివరాలు రాబట్టాల్సి ఉన్నందున నిందితులను రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. దాంతో కోర్టు ఐదుగురు నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా, ఈ నెల 27న సాయంత్రం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దాంతో వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలో ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రవూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్లో సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది.
సెల్లార్‌లోని లైబ్రరీలో చదువుకుంటున్న 33 మంది విద్యార్థులు ఈ వరదలో చిక్కుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 30 మంది విద్యార్థులను ప్రాణాలతో బయటికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే ముగ్గురు విద్యార్థులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నారు.